రేవంత్ రెడ్డి ఒక సైకో, శాడిస్ట్ అంటూ ఈటల ఫైర్… ఘాటుగా కౌంటర్ ఇచ్చిన జగ్గారెడ్డి

V. Sai Krishna Reddy
2 Min Read

హైదరాబాద్‌ శివారు బాచుపల్లిలోని పూజిత అపార్ట్‌మెంట్‌కు హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేత నోటీసులు జారీ చేసిన ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ నిన్న హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పెద్ద శాడిస్ట్, సైకో. ప్రజలను ఇబ్బందులకు గురిచేయడంలోనే ఆయన ఆనందం పొందుతున్నారు. రాష్ట్రంలో తుగ్లక్ ప్రభుత్వం నడుస్తోంది. ప్రజల జోలికి వస్తే ఖబడ్దార్,” అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి వాస్తవాలను సీఎం గమనించడం లేదని, తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియడం లేదని దుయ్యబట్టారు. “ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని వ్యవస్థను సరిదిద్దుకోవాలి. ప్రజల జీవితాలతో చెలగాటమాడేవారు ఎవరూ బాగుపడరు” అని హితవు పలికారు.

ఈ ఈటల పాగల్ గాడు అయ్యిండు: జగ్గారెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోసారి ఇటువంటి ‘లూజ్ కామెంట్స్’ చేస్తే సహించేది లేదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈ ఈటల పాగల్ గాడు అయ్యిండు… అన్నీ బేవకూఫ్ చేష్టలు చేస్తున్నాడు అంటూ మండిపడ్డారు. ఆదివారం నాడు గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తన నల్లికుట్ల రాజకీయాలు మానుకోవాలి. హద్దులు మీరి నువ్వు మాట్లాడావు, అందుకే నేను కూడా హద్దులు దాటి సమాధానం చెప్పాల్సి వస్తోంది. అసలు, ఈటలను తిట్టడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాను” అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఈటల ఏనాడూ మాట్లాడలేదని, కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని ఆయన ఆరోపించారు.

బీజేపీలో ఆశించిన పదవులు దక్కకపోవడంతో ఈటల రాజేందర్ తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. “గంజాయి తాగిన వ్యక్తిలా, ఒక సైకోలా ఈటల ప్రవర్తిస్తున్నాడు. పదవి రాలేదన్న ఫ్రస్టేషన్‌లోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారు” అని విమర్శించారు. బూతులు మాట్లాడే వారికి బూతులతోనే సమాధానం చెప్పాల్సి వస్తుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయతలచి ఈటల వ్యాఖ్యలను పట్టించుకోకుండా వదిలేస్తున్నారేమో కానీ, తాము మాత్రం అలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని జగ్గారెడ్డి హెచ్చరించారు. “మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి గురించి గానీ, కాంగ్రెస్ పార్టీ గురించి గానీ తగని రీతిలో మాట్లాడితే నడిరోడ్డు మీద బట్టలు విప్పి గుంజీలు తీయిస్తాం” అంటూ తీవ్ర పదజాలంతో జగ్గారెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఈటల తన పరిమితుల్లో ఉండి మాట్లాడటం నేర్చుకోవాలని సూచించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *