తన కూతురికి కాబోయే భర్తతో ఓ మహిళ పారిపోయిన వార్త దేశ వ్యప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. యూపీలోని అలీఘర్ లో వారం క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. స్వప్న అనే మహిళ తనకు కాబోయే అల్లుడు రాహుల్ తో వెళ్లిపోయింది. తాజాగా స్వప్న, రాహుల్ పోలీసుల ముందుకు వచ్చారు. ఇద్దరూ పారిపోవడానికి గల కారణాలను వారు వివరించారు.
తన భర్త బాగా తాగి వచ్చి తనను కొట్టేవాడని… తన కూతురు కూడా తనతో తరచుగా గొడవలు పడేదని స్వప్న తెలిపింది. అందుకే రాహుల్ తో వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. తాను అతడినే పెళ్లి చేసుకుంటానని, అతనితోనే ఉంటానని తెలిపింది. తన కుటుంబ సభ్యులు చెబుతున్నట్టు తాను రూ. 4 లక్షల డబ్బులు, రూ. 5 లక్షలు విలువ చేసే బంగారం తీసుకెళ్లలేదని చెప్పింది. తన మొబైల్ ఫోన్, రూ. 200 మాత్రమే తీసుకెళ్లానని తెలిపింది.
రాహుల్ మాట్లాడుతూ… అలీఘర్ బస్టాండ్ కు రాకపోతే ప్రాణాలు తీసుకుంటానని స్వప్న బెదిరించిందని… అందుకే తాను వెళ్లానని చెప్పాడు. తొలుత తాము లక్నోకు వెళ్లామని తెలిపాడు. అక్కడి నుంచి ముజఫర్ నగర్ కు వెళ్లామని… తమ గురించి పోలీసులు వెతుకుతున్నారనే వార్త తెలిసిన తర్వాత వెనక్కి వచ్చేశామని చెప్పాడు. స్వప్నను పెళ్లి చేసుకుంటానని తెలిపాడు.
మరోవైపు స్వప్న సోదరుడు మాట్లాడుతూ… ఆమెను ఇంట్లోకి రానిచ్చేది లేదని స్పష్టం చేశాడు. తీసుకెళ్లిన డబ్బులు, నగలు ఇచ్చేంత వరకు ఊరుకునేది లేదని హెచ్చరించాడు. స్వప్నను తన బావ కొట్టేవాడన్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పాడు.