తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మెయిన్స్ రాత పరీక్షల ఫలితాలు మార్చి 10న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే టీజీపీఎస్సీ కూడా ప్రకటన జారీ చేసింది. అయితే అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలు మాత్రమే మార్చి 10న వెల్లడికానున్నాయి. తొలుత టీజీపీఎస్సీ అభ్యర్థుల మార్కులను ప్రకటించి, ఆ తరువాత అభ్యంతరాలున్న వారి నుంచి రీకౌంటింగ్‌కు ఆప్షన్లు స్వీకరించి.. రీకౌంటింగ్ చేపడుతుంది. ఆ ప్రక్రియ ముగిశాక 1:2 నిష్పత్తిలో జాబితాను వెల్లడించనుంది. ఈ మేరకు మార్చి 10 (సోమవారం)వ తేదీన గ్రూప్ 1 ఆరు పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితా వెల్లడిస్తారు. అలాగే సబ్జెక్టుల వారీగా ప్రతి పేపర్‌లో సాధించిన మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో పొందుపరచనుంది. ప్రాథమిక జాబితాలో వచ్చిన మార్కులపై సందేహాలున్నవారి నుంచి 15 రోజుల్లోగా ఒక్కో పేపర్‌కు రూ. 1000 చొప్పున చెల్లించి రీకౌంటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తుదారుల పేపర్లలలోని మార్కులను అధికారులు మరోసారి లెక్కిస్తారు. లెక్కింపులో పొరపాట్లు ఉంటే సరిచేసిన తర్వాత మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జాబితాను టీజీపీఎస్సీ వెల్లడిస్తుంది. కాగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది అభ్యర్థులు హాజరైన సంగతి తెలిసిందే.
దళారులను నమ్మొద్దు: టీజీపీఎస్సీ
తెలంగాణ గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తప్పుదోవపట్టించే సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు ఛైర్మన్ సూచించారు. కమిషన్ పారదర్శకంగా నియామకాలు చేపడుతోందని, మధ్యవర్తులు తప్పుడు వాగ్దానాలు, హామీలు ఇచ్చినట్లు ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు రాలేదని కమిషన్ స్పష్టం చేసింది. అలాగే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, అలాంటి వారు ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే కమిషన్ మొబైల్ నంబరు 99667 00339, ఈ-మెయిల్ vigilance@tspsc.gov.inzకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది