తిరుమల, 2025 మార్చి 8: తిరుమలలో శ్రీవారి వార్షిక సాలకట్ల తెప్పోత్సవాలకు సర్వం సిద్ధమైంది. మార్చి 9 నుండి 13 వరకు ఐదు రోజుల పాటు ఈ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు స్వామి పుష్కరిణిలో స్వామి, అమ్మవార్లు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి.
ఈ ఉత్సవం కోసం పుష్కరిణిని సుందరంగా అలంకరించారు. ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేకంగా తెప్పను ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెప్పోత్సవాల్లో అలంకరణ కోసం సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగించనున్నారు. తెప్ప చుట్టూ షవర్ల ద్వారా నీటిని జల్లే ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయగా, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
తెప్ప అంటే పడవ. పడవలో శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తమిళంలో దీనిని ‘తిరుపల్లి ఓడై తిరునాళ్’ అని, తెలుగులో ‘తెప్ప తిరునాళ్లు’ అని పిలుస్తారు. తిరుమలలో తెప్పోత్సవాలు ప్రాచీన కాలం నుండి జరుగుతున్నాయని చరిత్ర చెబుతోంది. శ్రీ సాళువ నరసింహరాయలు 1468లో పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించి, తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య ఈ ఉత్సవాలను కీర్తించారు. వేసవి ప్రారంభంలో వెన్నెల వెలుగులో స్వామివారిని ఊరేగించడం భక్తులకు కనువిందు చేస్తుంది.
ఉత్సవంలో మొదటి రోజు సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, రెండవ రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణుడు మాడ వీధుల్లో ఊరేగింపుగా వచ్చి, పుష్కరిణిలో తెప్పపై మూడుసార్లు విహరిస్తారు. చివరి మూడు రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి మూడు, ఐదు, ఏడు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహిస్తారు.
తెప్పోత్సవాల కారణంగా, మార్చి 9, 10 తేదీల్లో సహస్రదీపాలంకరణ సేవ, మార్చి 11, 12, 13 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.