ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇది ఒక విపత్తు… అందరం కలిసి సానుభూతి ప్రకటించాల్సిన సమయం అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకుపోయిన 8 మంది కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను హెలికాప్టర్ లో హుటాహుటీన అక్కడికి పంపానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రతి నిమిషం సమీక్షిస్తూనే ఉన్నానని, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని తెలిపారు. సహాయక చర్యల్లో 11 కేంద్ర, రాష్ట్ర సంస్థలు పాలుపంచుకుంటున్నాయని వివరించారు.
కాగా, గతంలో దేవాదుల వద్ద ప్రమాదం జరిగితే తొమ్మిదేళ్లయినా ఆ ఐదుగురి మృతదేహాలు లభ్యం కాలేదని రేవంత్ రెడ్డి వివరించారు.
ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. మరి హరీశ్ రావు దుబాయ్ వెళ్లి రెండ్రోజులు ఎంజాయ్ చేయలేదా? హరీశ్ రావు ప్రయాణ వివరాలు తీయండి… దుబాయ్ వెళ్లాడో, లేదో తెలుస్తుంది” అని అన్నారు.