ప్రఖ్యాత ఇటాలియన్ మోటార్ సైకిల్ బ్రాండ్ డుకాటి భారత మార్కెట్లోకి సరికొత్త బైక్ ను తీసుకువచ్చింది. దీనిపేరు డెజర్ట్ ఎక్స్ డిస్కవరీ. ఇది లాంగ్ డ్రైవ్ లు చేసే వారికి ఆన్ రోడ్-ఆఫ్ రోడ్ బైక్ గా ఉపయోగపడుతుంది. ఇప్పటికే డుకాటీ భారత్ లో డెజర్ట్ ఎక్స్, ర్యాలీ పేరిట రెండు మోడళ్లను తీసుకువచ్చింది. ఈ రెండింటికి మిడిల్ వేరియంట్ గా తాజాగా డిస్కవరీని లాంచ్ చేసింది.
దీని ధర మూమూలుగా లేదు. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ రూ.21.78 లక్షలు అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంట్లో ఫీచర్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.
స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో కూడిన 5 అంగుళాల టీఎఫ్ టీ టచ్ స్క్రీన్, టర్న్ బై టర్న్ నేవిగేషన్, రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్, ఇంజిన్ బ్రేక్ క్రూయిజ్ కంట్రోల్, బై డెరెక్షనల్ క్విక్ షిఫ్టర్స్ వంటి ఫీచర్లతో ఈ బైక్ కుర్రకారు మదిని దోచేలా ఉంటుంది.
ఇక డుకాటీ డెజర్ట్ ఎక్స్ డిస్కవరీ బైకు పవర్ చూస్తే వావ్ అనాల్సిందే. దీంట్లో 937 సీసీ ఎల్ ట్విన్ ఇంజిన్ అమర్చారు. 6 స్పీడ్ ట్రాన్స్ మిషన్ ఇచ్చారు. శక్తిమంతమైన ఇంజిన్ ఉండడంతో ఇది 108 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. హైవేలపై వాయువేగంతో దూసుకుపోవచ్చు.
ఇక లార్జ్ విండ్ స్క్రీన్, రేడియేటర్ గార్డ్, బెల్లీ గార్డ్ వంటి యాక్సెసరీస్ కూడా పొందవచ్చు. ఇది వైట్, రెడ్, బ్లాక్ కలర్స్ లో లభ్యమవుతుంది.