చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఏ ప్రక్రియ జరిగినా చట్టబద్ధంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు హైడ్రాపై అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రికి రాత్రి నగరాన్ని మార్చలేమని, అక్రమ కట్టడాల విషయాలలోనూ చట్టప్రకారమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చట్టాన్ని దాటుకొని, జీవో 99కి విరుద్ధంగా వెళితే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించిన వివరాలను పరిశీలించకుండానే షెడ్డును కూల్చివేశారని పేర్కొంటూ ప్రవీణ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె. లక్ష్మణ్ నిన్న విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
హైడ్రాను అడ్డుపెట్టుకొని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని, వాటి ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పత్రాలను చూసి హక్కులను నిర్ణయించే అధికారం హైడ్రాకు ఎక్కడ ఉందని ప్రశ్నించింది. కూల్చివేతల విషయంలో నోటీసులు ఇచ్చి, వివరణ ఇచ్చేందుకు గడువు ఇచ్చి, చట్టప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొంది. ఎన్నిసార్లు చెప్పినా హైడ్రా తీరు మారడం లేదని అసహనం వ్యక్తం చేసింది.
పిటిషనర్ ప్రవీణ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పార్కు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని తెలిపారు. కానీ ఈ నిర్మాణాలకు 2023 నవంబర్ 15న గ్రామ పంచాయతీ అనుమతులు జారీ చేసిందని హైకోర్టుకు తెలిపారు.