పర్వతగిరి, ఫిబ్రవరి 20 (ప్రజాజ్యోతి):
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గ్రామానికి చెందిన ముంజల స్వామి(48) అనే కల్లుగీత కార్మికుడు రోజు లాగానే బుధవారం రోజు తాటి చెట్లు ఎక్కడానికి వెళ్లి ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి జారిపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని జీవన ఆధారం కళ్ళు తీసుకొని కుటుంబాన్ని పోషించుకునేవారు. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుండి తాటి చెట్లు ఎక్కడానికి బయలుదేరిన స్వామి రాత్రి 8 గంటలు దాటినా ఇంటికి తిరిగి రాలేదు. ఆ సమయంలో అటుగా వెళుతున్న బాల్నే రమేష్ చెట్టు పైనుండి జారిపడిన స్వామినిచూసి వారి కుటుంబ సభ్యులకు శరవాణి ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నేరుగా విలపించారు. స్వామి మృతి చెందాడనే విషయం తెలియగానే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.