టెస్లా భారత్ లోకి వస్తే పోటీని ఎలా తట్టుకుంటారు? అని అడిగితే ఆనంద్ మహీంద్రా సమాధానం ఇదే
1991లో ఆర్థిక సంస్కరణల తర్వాత ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయన్న ఆనంద్
పోటీని తట్టుకుని నిలబడ్డామని వెల్లడి
మహీంద్రా ఉత్పత్తులపై ఉన్న నమ్మకమే ఇందుకు కారణమని స్పష్టీకరణ
టెస్లా వచ్చినా తమ సంస్థ ఇలాగే ముందుకు సాగుతుందని ఆత్మవిశ్వాసం
ఎలాన్ మస్క్‌కు ఎప్పటిలాగే మద్దతిస్తామని వివరణ
టెస్లా భారత మార్కెట్లోకి వస్తే ఆ పోటీని ఎలా తట్టుకుంటారని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా భారత్‌లోకి ఆరంగేట్రం చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ పైవిధంగా ప్రశ్నించారు.
1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తర్వాత ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయని, అప్పుడు మార్కెట్లోకి వచ్చిన టాటా, సుజుకీ వంటి ఎన్నో ఇతర కంపెనీలతో పోటీని తట్టుకొని నిలబడ్డామని గుర్తు చేసుకున్నారు. మహీంద్రా ఉత్పత్తులపై ఉన్న నమ్మకమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. టెస్లా మార్కెట్లోకి వచ్చినా తమ సంస్థ ఇలాగే ముందుకు వెళుతుందని ఆయన పేర్కొన్నారు.
భారత ప్రజలు, వినియోగదారులు ఇస్తున్న ప్రోత్సాహంతో పోటీకి తగ్గట్టు తమను తాము మార్చుకుంటామని ఆయన పేర్కొన్నారు. 2018లో ఎలాన్ మస్క్ సంస్థలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనకు మద్దతు ఇస్తూ పెట్టిన పోస్టును ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. అప్పుడు ఆయనకు ఎలాగైతే మద్దతిచ్చామో, ఇప్పుడు కూడా అలాగే ఉంటామని అన్నారు.