2019 ఎన్నికలకు ముందు వైసీపీకి పాట పాడినందుకు తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ప్రముఖ గాయని మంగ్లీ అన్నారు. నా పాట ప్రతి ఇంట్లో పండుగ పాట కావాలని, కానీ పార్టీల పాట కాకూడదన్నది తన అభిప్రాయమని అన్నారు. 2024లో ఎన్నికల్లో తాను ఏ పార్టీకి పాటలు పాడలేదని తెలిపారు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. దేవుడి కార్యక్రమానికి వెళితే తనపై రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయడం సరికాదని ఆమె అన్నారు.
ఆమె ఇటీవల కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి అరసవల్లి దేవాలయానికి వెళ్లారు. దీంతో టీడీపీ క్యాడర్‌తో పాటు సామాజిక మాధ్యమంలో అసంతృప్తులు వెల్లువెత్తాయి. దీంతో మంగ్లీ బహిరంగ లేఖ రాశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు తనను సంప్రదిస్తే పాట పాడానని అన్నారు. పాటలు పాడానే తప్ప ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరినీ ఒక్కమాట అనలేదని ఆమె అన్నారు.
కేవలం వైసీపీకి మాత్రమే తాను పాటలు పాడలేదని, అన్ని పార్టీల లీడర్లకు కూడా పాటలు పాడానని తెలిపారు. వైసీపీకి పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను చంద్రబాబుకు పాట పాడానన్నది అవాస్తవమని ఆమె అన్నారు. రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనకు ఎలాంటి రాజకీయ అభిమతాలు లేవని, పక్షపాతాలు లేవని ఆమె అన్నారు. ఏ పార్టీకి తాను ప్రచారకర్తను కానని స్పష్టం చేశారు. తనకు పాటే ముఖ్యమని, తన పాటకు రాజకీయ రంగు పులమొద్దని విజ్ఞప్తి చేశారు.