టీటీడీ అన్యమత ఉద్యోగులపై చర్యలు

V. Sai Krishna Reddy
2 Min Read

టీటీడీ అన్యమత ఉద్యోగులపై చర్యలు

 18మంది ఉద్యోగులపై చర్యలు షురూ

టీటీడీ పాలకమండలి గతేడాది కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగులను బదిలీ చేయడం లేనిపక్షంలో వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ అన్యమత ఉద్యోగుల్ని గుర్తించింది. ఈ మేరకు తాజాగా 18మంది ఉద్యోగులపై చర్యలు ప్రారంభించింది. టీటీడీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.. ‘ఈ 18 మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాల్లో, ఆలయ అనుబంధ విభాగాల్లో విధులకు దూరంగా ఉంచాలి’ అని పేర్కొన్నారు.

టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు మొదలయ్యాయి.. టీటీడీ పాలకమండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో.. టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ హిందూ మతేతర సంప్రదాయాలను అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను అధికారులు గుర్తించారు. ఎండోమెంట్ యాక్ట్ 1060, 1989 ప్రకారం.. నవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు తీర్మానం ప్రకారం.. హిందూమత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొంది.. నేడు అన్యమతాన్ని అభ్యసిస్తూ.. భక్తుల మనోభావాలను, టీటీడీ పవిత్రతను కొందరు ఉద్యోగులు దెబ్బతీస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు వారిపై చర్యలు కూడా మొదలయ్యాయి.

తాజాగా తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న 18 మంది ఉద్యోగులపై చర్యలు ప్రారంభించారు. హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూ.. టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు తాజాగా కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.. ఈ 18 మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాల్లో, ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తుంటే.. వెంటనే వారిని బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ 18మందిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్లు, తదితరులు ఉన్నారు. ఇకపై సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని ఆదేశించారు. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ, లేని పక్షంలో వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని ఇటీవల టీటీడీ బోర్డు తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ 18మంది అన్యమత ఉద్యోగులపై చర్యలు మొదలు పెట్టింది టీటీడీ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *