- ఉగాది వేల వన్యప్రాణి ప్రాణం కాపాడి మానవత్వం చాటుకున్న వైనం
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) ఉగాది పర్వదినం వేళ పండుగ వెలుగులు నిండడమే కాదు.. ఓ మూగజీవి ప్రాణాలను కాపాడి ఆ డ్రైవర్ నిజమైన మానవత్వాన్ని చాటాడు. కుక్కల దాడిలో చావుబతుకుల్లో ఉన్న జింకను కాపాడి, అటవీశాఖ అధికారులకు అప్పగించి వన్యప్రాణి పట్ల తనకున్న మక్కువను చాటుకున్నాడు. ఖాజీపేట గ్రామ పంచాయతీ రామ్‌సింగ్ తండాకు చెందిన కాట్రోత్ శేఖర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 6 గంటల సమయంలో గండిమైసమ్మ నుంచి నర్సాపూర్ వైపు వస్తుండగా.. అటవీ ప్రాంతంలో ఓ భయానక దృశ్యం ఆయన కంటపడింది. ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా విహరించాల్సిన ఓ జింకపై నాలుగు శునకాలు విచక్షణారహితంగా దాడి చేస్తున్నాయి. కుక్కల దాడికి భయపడి, గాయాలతో ఆ జింక ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతోంది.
• సకాలంలో స్పందన.. ఆటోలోనే అటవీ కార్యాలయానికి
ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయిన శేఖర్.. వెనుకాముందూ ఆలోచించకుండా ఆటో ఆపి కుక్కలను తరిమికొట్టారు. తీవ్ర భయాందోళనకు గురైన ఆ జింక అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. వెంటనే జింకను జాగ్రత్తగా తన ఆటోలో ఎక్కించుకుని నర్సాపూర్ అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. తక్షణమే అధికారులు జింకకు ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం జింక క్షేమంగా ఉందని, వైద్య పరీక్షల అనంతరం పోచారం అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అధికారులు చెప్పినట్లు శేఖర్ తెలిపాడు.
• నా చేతులతో కాపాడటం తృప్తినిచ్చింది: శేఖర్
సాధారణంగా జింకలను చూడాలంటే జూ పార్కులకు వెళ్తుంటాం. కానీ, పండుగ రోజున అడవిలో ఆపదలో ఉన్న వన్యప్రాణిని కాపాడి, స్వయంగా నా చేతులతో అధికారులకు అప్పగించడం చాలా ఆనందంగా ఉంది. ఉగాది పర్వదినాన ఒక జీవి ప్రాణాన్ని కాపాడటం నా జన్మధన్యమైనట్లు అనిపిస్తోందని ఆటో డ్రైవర్ చెప్పుకొచ్చాడు.
