సిద్ధిపేట రూరల్, మార్చి 15 , (ప్రజాజ్యోతి) : ఎల్లమ్మ తల్లి అనుగ్రహంతో మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రానికి మంచి రోజులు రావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆకాంక్షించారు.ఆదివారం నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ సిద్ధోగం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్రాల గొంది గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడం, పచ్చని పంట పొలాలు కనిపించడం అన్నీ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న రైతు అనుకూల విధానాల ఫలితమేనని అన్నారు.రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం రైతులకు ఎంతో మేలు చేసిందని, అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు అమలులో ఆలస్యం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికీ రైతులకు రైతు బంధు సొమ్ము అందకపోవడం దురదృష్టకరమన్నారు.గుర్రాల గొంది గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధి కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించినట్లు హరీష్ రావు తెలిపారు. దేవాలయం వద్ద భక్తులకు సౌకర్యం కల్పించేందుకు 5 లక్షల రూపాయల వ్యయంతో షెడ్ నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు.గ్రామాన్ని దత్తత తీసుకున్న రవీందర్ రావు సహకారంతో దేవాలయం వద్ద గ్రానైట్ పనులు, డ్రిల్లింగ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. దేవాలయం ముందు స్లాబ్ వేయడానికి తాను వ్యక్తిగతంగా మరో లక్ష రూపాయాల ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని గౌడ సంఘం కోసం పది లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు . గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలన్నారు. అనంతరం గ్రామంలోని పోచమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, భక్తులు ,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
