ఎస్సీ సెల్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సత్యనారాయణను సన్మానించిన వరంగల్ జిల్లా అధ్యక్షుడు
వర్ధన్నపేట జనవరి 13, ప్రజా జ్యోతి::
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షులుగా ఎన్నికైన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను సోమవారం హరిత టూరిజం ప్లాజా, బేగంపేట్‌లో వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూళ్ల రవి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు తూళ్ల రవి, కవ్వంపల్లి సత్యనారాయణ ఆరుసార్లు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించడమే కాక, దళితుల సమస్యలపై నిరంతరం శ్రద్ధతో పనిచేస్తూ ప్రజా సేవలో నిలకడగా ఉన్న నాయకుడని పేర్కొన్నారు.
దళిత విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవికి కవ్వంపల్లి సత్యనారాయణ పూర్తిగా అర్హులని, ఆయనకు దళిత వర్గాలపై అపారమైన ప్రేమ, సేవాభావం ఉన్నాయని రవి తెలిపారు.
త్వరలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆదేశానుసారం వర్ధన్నపేట మండలంలో కవ్వంపల్లి సత్యనారాయణకి సన్మాన సభ ఏర్పాటు చేస్తామని రవి వెల్లడించారు. ఆ సన్మాన సభకు దళిత వర్గాలందరినీ ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
దళితుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుండిందని, ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కూడా కాంగ్రెస్‌కే చెందుతుందని ఆయన పేర్కొన్నారు.
తద్వారా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి దళితుల అభివృద్ధిపై కట్టుబడి ఉన్నారని రవి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో దళితులకు 15% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు పేర్కొంటూ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్‌గా దళిత ప్రతినిధిని నియమించడం, మంత్రివర్గంలో మూడు దళిత మంత్రులకు అవకాశం కల్పించడం సీఎం రేవంత్ రెడ్డి పాలనలో జరిగిన విశేషమని అన్నారు.
