కరెంటు లేదు, తిండి లేదు, షాపుల ముందు బారులుతీరిన ప్రజలు… వెనిజులాలో ప్రస్తుత పరిస్థితి ఇదీ

V. Sai Krishna Reddy
3 Min Read

వెనెజువెలాపై అమెరికా జరిపిన ఆకస్మిక మెరుపు దాడులతో ఆ దేశం అంధకారంలోకి జారుకుంది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జరిగిన ఈ దాడుల్లో కీలకమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్ గ్రిడ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో దేశ రాజధాని కారకాస్‌తో పాటు అనేక నగరాలు, పట్టణాలు అంధకారంలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆహారం, తాగునీరు, మందులు వంటి నిత్యావసరాల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దాడుల తదనంతర పరిణామాలను, అక్కడి ప్రజల దయనీయ స్థితిని కారకాస్‌లో నివసిస్తున్న సునీల్ మల్హోత్రా అనే భారతీయుడు మీడియాకు వివరించారు.

ఆహారం కోసం గంటల తరబడి నిరీక్షణ

దాడుల ప్రభావంతో దేశంలో తీవ్ర భయాందోళనకర వాతావరణం నెలకొందని సునీల్ మల్హోత్రా తెలిపారు. “అమెరికా దాడులతో భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. కరెంటు లేకపోవడంతో కారకాస్‌లోని అన్ని ప్రధాన సూపర్ మార్కెట్లు, పెద్ద దుకాణాలు మూతపడ్డాయి. కేవలం కొన్ని చిన్న దుకాణాలు మాత్రమే తెరిచి ఉన్నాయి. వాటి ముందు నిత్యావసరాల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు.

ఒక్కో దుకాణం ముందు 500 నుంచి 600 మంది వరకు పొడవైన క్యూలలో గంటల తరబడి నిలబడుతున్నారు. మందుల కోసం ఫార్మసీల వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా జంకుతున్నారని, దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయని ఆయన పేర్కొన్నారు.

ధ్వంసమైన కీలక స్థావరాలు

ఈ దాడుల్లో అమెరికా సైన్యం కీలకమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుందని సునీల్ తెలిపారు. “కారకాస్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి జరిగింది. నగరానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద వైమానిక స్థావరం కూడా ధ్వంసమైంది. ముఖ్యంగా, ఫోర్ట్ ట్యూనా మిలిటరీ స్థావరంపై జరిగిన దాడిలో ఎక్కువ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది” అని ఆయన వివరించారు. ఈ దాడుల వల్ల ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని, బస్సులు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని చెప్పారు.

ఫోన్ ఛార్జింగ్ కోసం అవస్థలు

కరెంటు సరఫరా లేకపోవడంతో ఆధునిక జీవన విధానంలో అత్యంత కీలకమైన మొబైల్ ఫోన్ల వాడకం కష్టతరంగా మారింది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో ప్రజలు తమ ఆత్మీయులతో మాట్లాడటానికి, సమాచారం తెలుసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఫోన్లు ఛార్జ్ చేసుకునేందుకు ప్రజలు పడుతున్న పాట్లు అక్కడి దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. రోడ్లపై అడపాదడపా వెలుగుతున్న కొన్ని సోలార్ విద్యుత్ దీపాల కిందకు చేరి ప్రజలు తమ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు.

తాను కూడా తన ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టేందుకు చాలా దూరం నడిచి వెళ్లాల్సి వచ్చిందని సునీల్ మల్హోత్రా చెప్పారు. విద్యుత్ సరఫరా ఎప్పుడు పునరుద్ధరించబడుతుందనే దానిపై స్థానిక అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదని, దీంతో ప్రజల్లో అనిశ్చితి, ఆందోళన మరింత పెరిగాయని ఆయన అన్నారు.

భారతీయుల కోసం ఎంబసీ చర్యలు

వెనెజువెలాలో భారతీయుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు అక్కడి భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. వెనెజువెలాలో నివసిస్తున్న భారతీయులందరి కోసం ప్రత్యేకంగా ఒక వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఈ గ్రూప్ ద్వారా అక్కడి భారతీయులకు నిరంతరం ముఖ్యమైన సూచనలు, సలహాలు అందిస్తూ భద్రతాపరమైన మార్గదర్శకాలను జారీ చేస్తోంది.

ఎంబసీ అధికారులు అందరితో టచ్‌లో ఉంటూ వారికి ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం వెనెజువెలాలో నెలకొన్న సంక్షోభం ఎప్పటికి ముగుస్తుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *