నర్సాపూర్/కౌడిపల్లి (ప్రజాజ్యోతి) మండల పరిధిలోని తునికి గ్రామ సమీపంలో హైదరాబాద్‌కు చెందిన కొందరు యువకులు, స్థానిక యువకులపై దౌర్జన్యానికి దిగారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను బూతు మాటలతో దూషించడంతో మొదలైన ఈ ఘర్షణ చివరకు కర్రలతో దాడి, దేహశుద్ధి వరకు వెళ్లింది. జక్కపల్లి గ్రామానికి చెందిన తలారి అనిల్ మరియు తలారి రమేష్ తమ ద్విచక్ర వాహనంపై వెంకట్రావుపేట నుండి తునికి మీదుగా జక్కపల్లికి వెళ్తున్నారు. అదే సమయంలో, ఆటోలో వచ్చిన హైదరాబాద్‌కు చెందిన 10 మంది యువకులు,(1 యువతి) వారిని బూతు🖕 సైగలతో దూషించారు. దీంతో ఆగ్రహించిన అనిల్, రమేష్ వెంటనే ఆటోను ఆపి, ఎందుకు దూషించారంటూ ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. హైదరాబాద్ యువకులు కర్రలు తీసుకుని అనిల్ మరియు రమేష్‌లపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇరువురు తీవ్ర గాయాల పాలవడంతో, ఆకతాయిలు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన రమేష్, వెంటనే తన గ్రామస్తులకు ఫోన్ చేసి విషయం తెలియజేశాడు. గ్రామస్తులు హుటాహుటిన సమీపంలోని స్థానికులకు సమాచారం అందించారు. తునికి వద్దకు చేరుకున్న గ్రామస్తులు, పారిపోతున్న హైదరాబాద్ ఆకతాయిల ఆటోను అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. స్థానిక యువకులపై దాడికి పాల్పడినందుకు ఆగ్రహించిన గ్రామస్తులు, పట్టుబడిన ఆకతాయిలకు దేహశుద్ధి చేసి వారిని పోలీసులకు అప్పగించారు. గాయపడిన ఇరువురిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
