దేశ రాజధాని ఢిల్లీ సోమవారం సాయంత్రం భారీ పేలుడుతో ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్క్ చేసి ఉన్న కార్లలో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 10కి పెరిగింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది.
పేలుడు సమాచారం అందిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. హోంమంత్రి అమిత్ షా వెంటనే ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గొల్చా, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్ తపన్ డేకాలతో ఫోన్‌లో మాట్లాడారు. అలాగే, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్‌కు ఫోన్ చేసి, వెంటనే ఎన్ఐఏ బృందాన్ని ఘటనా స్థలానికి పంపాలని ఆదేశించారు.
గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు. ఎర్రకోట పరిసర ప్రాంతాలు అత్యంత రద్దీగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఘటనా స్థలానికి పలు అగ్నిమాపక శకటాలు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మరోవైపు, నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇది ఉగ్రవాదుల పనేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, ఇదే రోజు ఉదయం ఢిల్లీ సమీపంలోని హరియాణాలోని ఫరీదాబాద్‌లో జైషే మహ్మద్ (JeM), అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఓ భారీ ఉగ్రవాద ముఠాను జమ్మూకశ్మీర్ పోలీసులు ఛేదించడం గమనార్హం. ఈ దాడిలో ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంతో పాటు, 2,900 కిలోల పేలుడు పదార్థాలు, ఏకే-47 రైఫిళ్లు, పిస్టళ్లు, టైమర్లు స్వాధీనం చేసుకున్నారు.
బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలకు ఒక రోజు ముందు దేశ రాజధానిలో ఈ విధ్వంసం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.
