టెక్ దిగ్గజం గూగుల్, దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో మధ్య కీలక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది. భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ రెండు సంస్థలు చేతులు కలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా అర్హులైన జియో వినియోగదారులకు 18 నెలల పాటు గూగుల్ ఏఐ ప్రో ప్లాన్‌ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించాయి.
ఈ భాగస్వామ్యంపై గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హర్షం వ్యక్తం చేశారు. “రిలయన్స్ జియోతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. అర్హులైన జియో యూజర్లకు 18 నెలల పాటు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మా ఏఐ ప్రో ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఇందులో జెమినీ 2.5 ప్రో, 2 టీబీ స్టోరేజ్, మా సరికొత్త ఏఐ టూల్స్ ఉంటాయి. కలిసి మనం ఏం నిర్మిస్తామో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ఆయన పోస్ట్ చేశారు.
రూ.35,100 విలువైన ప్రయోజనాలు
సుమారు రూ.35,100 విలువైన ఈ ఆఫర్లో భాగంగా యూజర్లకు గూగుల్ అత్యంత శక్తిమంతమైన జెమినీ 2.5 ప్రో మోడల్‌తో పాటు అత్యాధునిక నానో బనానా, వియో 3.1 మోడల్స్‌తో చిత్రాలు, వీడియోలు రూపొందించుకునే అవకాశం లభిస్తుంది. అలాగే చదువు, పరిశోధనల కోసం ఉపయోగపడే నోట్‌బుక్ ఎల్ఎమ్, 2 టీబీ క్లౌడ్ స్టోరేజ్ వంటి సేవలు కూడా ఉంటాయి. అర్హులైన జియో యూజర్లు తమ మైజియో యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.
తొలి దశలో 18 నుంచి 25 ఏళ్ల వయసు గల, అన్లిమిటెడ్ 5జీ ప్లాన్లు కలిగిన యువతకు ఈ సేవలను అందుబాటులోకి తేనున్నారు. అతి తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా ఉన్న జియో కస్టమర్లందరికీ దీనిని విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది.
‘ఏఐ ఫర్ ఆల్’ లక్ష్యంగా ఒప్పందం
రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్, గూగుల్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ‘ఏఐ ఫర్ ఆల్’ అనే రిలయన్స్ దార్శనికతకు అనుగుణంగా ఉంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, రిలయన్స్ తన అత్యాధునిక కంప్యూటింగ్ సామర్థ్యాల కోసం గూగుల్ క్లౌడ్ టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్స్ (TPUs)ను వినియోగించుకోనుంది. భారత్‌ను గ్లోబల్ ఏఐ పవర్‌హౌస్‌గా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ ఒప్పందం మరింత బలాన్నిస్తుందని ఇరు సంస్థలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
ఈ ఒప్పందంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ… “145 కోట్ల మంది భారతీయులకు ఏఐ సేవలను అందుబాటులోకి తేవడమే రిలయన్స్ ఇంటెలిజెన్స్ లక్ష్యం. గూగుల్ వంటి వ్యూహాత్మక భాగస్వామితో కలిసి, భారత్‌ను కేవలం ‘ఏఐ ఎనేబుల్డ్’గా కాకుండా ‘ఏఐ ఎంపవర్డ్’ దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని తెలిపారు.
