తమిళంలో ఈ మధ్య కాలంలో థియేటర్లకు వచ్చిన ఒక సినిమా వివాదాస్పదంగా నిలిచింది. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా ఉందనే ఆరోపణలు ఈ సినిమాను చుట్టుముట్టాయి. టీజర్ నుంచే విమర్శలను ఎదుర్కొవడం .. ఈ సినిమా కారణంగా కొంతమందిపై దాడులు జరగడం చర్చనీయాంశమైంది. విషయం కోర్టు వరకూ వెళ్లడంతో, కొన్ని సన్నివేశాలను తొలగించి రిలీజ్ చేయడం జరిగింది. ఆలా ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైంది.
ఇంత గొడవ జరిగిన ఈ సినిమాకి నిర్మాత వెట్రిమారన్ కావడమే విశేషం. వెట్రి మారన్ కథలు సామాజిక అంశాలను ప్రధానంగా చేసుకుని సాగుతాయి. అయితే ఈ సినిమా విషయంలో ఆయన ఎంచుకున్న అంశమే వివాదానికి కారణమైంది. ఆయన శిష్యురాలు వర్ష భరత్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం జరిగింది. అంజలి శివరామన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, నవంబర్ 4వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఆచార సంప్రదాయాలను పాటించే ఒక పద్ధతి కలిగిన కుటుంబానికి చెందిన రమ్య అనే టీనేజ్ అమ్మాయి, తనకి సరైన జోడీని వెతుక్కోవడం మొదలుపెడుతుంది. కానీ కుటుంబం .. పేరెంట్స్ ఆంక్షలు .. సమాజలోని కట్టుబాట్లు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అలంటి పరిస్థితులలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుంది? అనేది కథ. చూడాలి మరి ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో
