బంగారం ధరలు ఈ మధ్యకాలంలో తగ్గుముఖం పడుతున్నాయి. దీపావళి సమయంలో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధర, ప్రస్తుతం దిద్దుబాటుకు గురవుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాల వల్ల పసిడితో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ముఖ్యంగా, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే అంచనాలు ఈ ధరల దిద్దుబాటుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య అక్టోబర్ 30న సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం వాణిజ్య ఒప్పందంపై కీలక ప్రకటన వెలువడవచ్చనే అంచనాతో పసిడికి డిమాండ్ తగ్గిందని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సు 4 వేల డాలర్ల దిగువకు చేరింది.
హైదరాబాద్‌లో మధ్యాహ్నం సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1.22 లక్షలుగా నమోదైంది. కిలో వెండి ధర రూ. 1.48 లక్షల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర గరిష్ఠ స్థాయి నుంచి రూ.10 వేలకు పైగా తగ్గింది. ఈరోజు కిలో వెండి ధర రూ. 5 వేలకు పైగా దిగొచ్చింది.
