ఐపీఎస్ అధికారి ఇంట్లో నోట్ల గుట్టలు.. లగ్జరీ కార్లు, ఖరీదైన వాచ్‌ల స్వాధీనం

V. Sai Krishna Reddy
2 Min Read

పంజాబ్‌లో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అవినీతి బాగోతం బట్టబయలైంది. కేవలం రూ. 8 లక్షల లంచం ఆరోపణలతో మొదలైన కేసులో సోదాలు చేయగా ఆయన నివాసంలో ఏకంగా రూ. 5 కోట్ల నగదు కట్టలు బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో రోపర్‌ రేంజ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) హర్‌చరణ్ సింగ్ భుల్లార్‌ను, అతడి మధ్యవర్తి కృష్ణాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్ట్ చేసింది.

వల పన్ని పట్టుకున్న సీబీఐ
వివరాల్లోకి వెళితే.. ఫతేగఢ్ సాహిబ్‌కు చెందిన ఆకాశ్ బట్టా అనే స్క్రాప్ వ్యాపారి ఐదు రోజుల క్రితం సీబీఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన వ్యాపారానికి సంబంధించి తప్పుడు కేసులో ఇరికిస్తానని డీఐజీ భుల్లార్ బెదిరిస్తున్నారని, కేసును “సెటిల్” చేయడానికి రూ. 8 లక్షల లంచంతో పాటు ప్రతినెలా మామూళ్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ డబ్బును తన మధ్యవర్తి కృష్ణా ద్వారా పంపాలని డీఐజీ సూచించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ, నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి పక్కా ప్రణాళికతో వల పన్నింది. చండీగఢ్‌లోని సెక్టార్ 21లో వ్యాపారి నుంచి మధ్యవర్తి కృష్ణా రూ. 8 లక్షలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. వెంటనే, ఫిర్యాదుదారుడితో డీఐజీకి ఫోన్ చేయించగా, డబ్బు అందినట్లు ఆయన ధ్రువీకరించారు. ఈ ఆధారంతో మొహాలీలోని కార్యాలయంలో ఉన్న డీఐజీ భుల్లార్‌ను, మధ్యవర్తి కృష్ణాను సీబీఐ బృందం అరెస్ట్ చేసింది.

సోదాల్లో బయటపడ్డ అక్రమాస్తుల జాతకం
అరెస్టుల అనంతరం డీఐజీకి సంబంధించిన రోపర్‌, మొహాలీ, చండీగఢ్‌లోని పలు నివాసాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బయటపడిన అక్రమాస్తుల వివరాలు చూసి అధికారులు సైతం విస్తుపోయారు. సుమారు రూ. 5 కోట్ల నగదు (లెక్కింపు ఇంకా కొనసాగుతోంది), కిలోన్నర బంగారం, ఆభరణాలు, పంజాబ్‌లోని స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, బెంజ్, ఆడి వంటి రెండు లగ్జరీ కార్ల తాళాలు, 22 ఖరీదైన చేతి గడియారాలు, లాకర్ తాళాలు, 40 లీటర్ల విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు మధ్యవర్తి కృష్ణా ఇంటి నుంచి మరో రూ. 21 లక్షల నగదును సీజ్ చేశారు.

2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన భుల్లార్, గతంలో పలు కీలక పదవులు చేపట్టారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన ‘యుధ్ నషేయాన్ విరుధ్’ ప్రచారంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఆయన తండ్రి ఎంఎస్ భుల్లార్ పంజాబ్ మాజీ డీజీపీ కావడం గమనార్హం. ప్రస్తుతం ఇద్దరు నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని, అక్రమాస్తుల పూర్తి వివరాలను రాబట్టే పనిలో ఉన్నామని వివరించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *