- చోరీలకు పాల్పడుతున్న ఇంటర్ విద్యార్థితో సహా ఇద్దరు అరెస్ట్
ఆత్మకూరు, అక్టోబర్ 10 (ప్రజాజ్యోతి):
ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్లో ఒక మైనర్ తో సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా వీరి నుండి 10గ్రాముల బంగారం, 13వేల రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసినట్లు పరకాల ఏసీపీ సతీష్ బాబు వెల్లడించారు. కటాక్షపూర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక టూ వీలర్ బండి పై వస్తూ పోలీసులను చూసి వెనకకు తిరిగి పారిపోతుండగా అనుమానం వచ్చి వెంబడించి పోలీసులు పట్టుకున్నారు. హనుమకొండ జిల్లా గోపాలపూర్ కు చెందిన పాశం ప్రణీత్, భీమారం ఇన్స్ పైర్ జూనియర్ కాలేజ్ విద్యార్థి సరిగొమ్ముల లియోన్ స్ఫూర్జన్ రాజ్ (స్వ స్థలం జమ్మికుంట, కరీంనగర్) లు జల్సాలకు మరియు మద్యం త్రాగడానికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో టెంపుల్ లలో దొంగతనం చేయాలనుకొని తేదీ 04.06.2025 రోజున వీరిద్దరూ తన్నిముట్టి సాయి తో కలిసి ఆత్మకూర్ మండలం లోని గూడెప్పాడు లోని రామాలయం టెంపుల్ లో నగదు రూ. 1,000/- మరియు రాముల వారి వెండి జంజరం, మరియు రెండు బంగారు గంటె పుస్తెలు వాటి మొత్తం విలువ రూ. 28,000/- దొంగతనం చేశారు. అదే విధంగా 24.06.2025 రోజున మళ్లీ వీరు ముగ్గురు కలిసి దుగ్గొండి మండలం లోని గిర్ని బావి వద్ద గల ఒక వైన్ షాప్ లో వెంటీలేటర్ కు ఉన్న గ్రిల్స్ ను కూడా పగులగొట్టి లోపలికి వెళ్ళి అందులో కౌంటర్ లో ఉన్న చిల్లర డబ్బులు సుమారు రూ. 12,000/- మరియు అంధులో గల మద్యం బాటిల్లు దొంగతనం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్బంగా ఏసిపి సతీష్ బాబు కేసులో ప్రతిభ కనబర్చిన హెడ్ కానిస్టేబుల్ కుమార స్వామి, కే. శ్రీనివాస్ లను అభినందించారు.