• మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు
నర్సాపూర్(ప్రజాజ్యోతి) రాబోయే స్థానిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు సత్తా చాటాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన భాజపా కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యి ప్రారంభించారు. మొదట పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ వీరినారి చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు బరిలో ఉండి అధిక సీట్లు గెలవాలని, అందుకోసం ఇప్పటినుండి అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. కరోనా కష్టకాలంలో 365 రోజులలో ఒక్కరోజు సెలవు తీసుకోకుండా 24 గంటలు అవిశ్రాంతిగా ప్రజల మేలు కోసం పరితపించిన గొప్ప నాయకుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ అని ఆయన గొప్పతనాన్ని చాటారు. ప్రతి భాజపా కార్యకర్త 24 గంటల్లో ఒక్క గంట చొప్పున సమిష్టిగా శ్రమించి పార్టీ కోసం పని చేసినట్లయితే రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని భాజపా కైవసం చేసుకోవడం ఖాయమని దీమావ్యక్తం చేశారు. గండిమైసమ్మ నుండి మెదక్ వరకు నాలుగు వరుసల రోడ్డుకు నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల నుండి నర్సాపూర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించడం జరుగుతుందన్నారు. అటవీ ప్రాంతంలో మలుపులు, చెట్లు నరకడం వంటివి ఉండదన్నారు. ఎలివేటెడ్ కారిడార్ కోసమే తాను ప్రయత్నం చేస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా భాజపాధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్, రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సంఘసాని సురేష్, యాదగిరి, బుచ్చేసి యాదవ్, రమేష్ గౌడ్, ప్రేమ్ కుమార్, గుండం శంకర్, బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.