జమ్ము కశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్… 12 మంది మృతి

V. Sai Krishna Reddy
2 Min Read

జమ్మూకాశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. చోసోటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ (కుండపోత వర్షం) కారణంగా సంభవించిన జల ప్రళయంలో 12 మంది మరణించారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో, అధికారులు ప్రముఖ మచైల్ మాత యాత్రను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మచైల్ మాత ఆలయానికి వెళ్లే మార్గంలో వాహనాలు ప్రయాణించడానికి వీలున్న చివరి గ్రామాల్లో చోసోటి ఒకటి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, పద్దార్ సబ్-డివిజన్‌లో ఉన్న ఈ గ్రామంలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. సమాచారం అందుకున్న వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ శర్మ, ఎస్ఎస్పీ నరేష్ సింగ్ నేతృత్వంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలోని ఒక బృందం ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలను ప్రారంభించింది. సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

ఈ ఘటనపై జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగడంపై విచారం ప్రకటిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు, సైనిక బలగాలను ఆదేశించినట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా… కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడారు. కిష్ట్వార్‌లోని క్లిష్ట పరిస్థితులను, సహాయక చర్యల వివరాలను ఆయనకు వివరించారు. క్షేత్రస్థాయి నుంచి సమాచారం ఆలస్యంగా అందుతోందని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను సహాయక చర్యల కోసం సమీకరిస్తున్నామని ఆయన అన్నారు. మరోవైపు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఈ ఘటనను ధృవీకరించారు. పరిపాలన యంత్రాంగం తక్షణమే స్పందించి సహాయక బృందాలను పంపిందని, నష్టాన్ని అంచనా వేస్తూ వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన వివరించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *