బీసీ నేతలను బీజేపీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని వదిలేస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈటల రాజేందర్‌కు బీజేపీలో ఇదే గతి పట్టిందని విమర్శించారు.
బీసీ నేత బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన బీజేపీ, ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పాల్ ఎద్దేవా చేశారు. “బీసీ పార్టీ అని చెప్పుకునే బీజేపీ, బండి సంజయ్‌ను ఎందుకు పదవి నుంచి దించేసింది? ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి బీసీ నేతలను కాదని బ్రాహ్మణ వర్గానికి చెందిన రాంచందర్ రావుకు ఎలా అవకాశం కల్పించారు?” అని ఆయన ప్రశ్నించారు. తాను బ్రాహ్మణులకు వ్యతిరేకిని కాదని, కానీ బీజేపీ బీసీ ముసుగు ధరించి ఇలాంటి పనులు ఎలా చేస్తుందని నిలదీశారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపైనా పాల్ విమర్శలు గుప్పించారు. కొద్ది రోజులు జైలులో ఉండి రాగానే కవిత బీజేపీ గానం చేస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే కవితను బీసీ నినాదంతో తెరపైకి తెచ్చారని అన్నారు. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ కూడా పోటీ చేస్తుందని కేఏ పాల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.