ప్రముఖ సినీ నటుడు, తన విలక్షణ నటనతో గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వెంకట్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి, వెంకట్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఫిష్ వెంకట్‌కు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, ఆయన త్వరగా కోలుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు.
అనంతరం మంత్రి శ్రీహరి మాట్లాడుతూ…. “ఫిష్ వెంకట్ అనారోగ్యం గురించి తెలియగానే ఆయన్ను చూడటానికి వచ్చాను. తన సహజమైన నటనతో, తెలంగాణ మారుమూల యాసను వెండితెరకు పరిచయం చేసిన గొప్ప కళాకారులలో ఆయన ఒకరు” అని ప్రశంసించారు. ఫిష్ వెంకట్ చికిత్సకు తన వంతు సహాయంతో పాటు ప్రభుత్వం తరఫున కూడా పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు