బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల ను ఉద్దేశించి.. బానిస పార్టీలంటూ.. వ్యాఖ్యానించారు. “బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎం నేతలకు ఊడిగం చేస్తున్నాయి. బానిస పార్టీలుగా వ్యవహరిస్తున్నాయి“ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపత్యంలో బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు.
ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో.. బీజేపీ కార్పొరేటర్లకు, స్టాండింగ్ కమిటీ, ఎక్స్ అఫిషియో సభ్యులు గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంఐఎం గెలుపు కోసం.. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు సహాయం చేస్తున్నాయని మండిపడ్డారు. తమ తమ పార్టీలకు చెందిన అభ్యర్థులను కూడా నిలబెట్టకుండా.. ఎంఐఎంకు బానిసలుగా పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించా రు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీగాతాము మాత్రమే ఉన్నామని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో చెప్పాలన్నారు. ఎంఐఎం-బీఆర్ ఎస్-కాంగ్రెస్ పార్టీలు.. మూకుమ్మడిగా వచ్చి బీజేపీపై యుద్ధం చేస్తున్నాయని అన్నారు. అయినప్పటికీ.. విజ్ఞులైన కార్పొరేటర్లకు అన్నీ తెలుసునని.. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తారని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ ఎస్ దోచుకుంటే.. ఇప్పుడు వారికి పోటీ పడుతూ.. కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని అన్నారు. గుజరాత్లో తాజాగా నిర్వహించిన ఏఐసీసీ సమావేశాలకు నిధులు తెలంగాణ ప్రజలే ఇచ్చారని ఆరోపించారు. ఇక్కడ నుంచి మూటలు మోస్తున్నారని.. ప్రజలపై మాత్రం భారాలు మోపుతున్నారని దుయ్యబట్టారు. అందుకే.. ప్రజల తరఫున తాము గళం వినిపిస్తున్నామని.. డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.