ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి వార్తల్లో నిలిచింది. శిక్షణ కాలంలో నిర్వహించిన అంతర్గత మదింపు పరీక్షల్లో నిర్దేశిత ప్రమాణాలను అందుకోలేకపోయారనే కారణంతో 240 మంది ట్రైనీ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు ఏప్రిల్ 18న బాధిత ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ దాదాపు 300 మందికి పైగా ట్రైనీలను ఇదే కారణంతో తొలగించిన నేపథ్యంలో, తాజా పరిణామం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
“అదనపు శిక్షణ సమయం, సందేహ నివృత్తి సెషన్లు, పలు మాక్ అసెస్మెంట్లు, మూడు ప్రయత్నాలకు అవకాశం ఇచ్చినప్పటికీ, మీరు ‘జనరిక్ ఫౌండేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్’లో అర్హత ప్రమాణాలను అందుకోలేకపోయారు. ఫలితంగా, మీరు అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌లో మీ ప్రయాణాన్ని కొనసాగించలేరు” అని ఏప్రిల్ 18న పంపిన తొలగింపు ఈమెయిల్లో పేర్కొన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.
అయితే, ఉద్యోగం కోల్పోయిన ట్రైనీలకు కంపెనీ కొన్ని సహాయక చర్యలను ప్రకటించింది. వారికి ఒక నెల వేతనాన్ని ఎక్స్‌గ్రేషియాగా చెల్లించనుంది. దీంతో పాటు రిలీవింగ్ లెటర్, ఉద్యోగాన్వేషణలో సహాయపడేందుకు ప్రొఫెషనల్ ఔట్‌ప్లేస్‌మెంట్ సేవలను అందించనున్నట్లు ఈమెయిల్లో వివరించింది. అంతేకాకుండా, వారి భవిష్యత్ కెరీర్‌కు తోడ్పడేలా రెండు రకాల ఉచిత శిక్షణా కార్యక్రమాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఎన్ఐఐటీ (NIIT), అప్‌గ్రాడ్ (UpGrad) వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ శిక్షణ అందించనున్నట్లు తెలిపింది.
“శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, మీరు ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, మీరు మీ ఐటీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంటే, మీ ఐటీ కెరీర్ ప్రయాణానికి మరింత మద్దతు ఇవ్వడానికి ఇన్ఫోసిస్ ప్రాయోజిత బాహ్య శిక్షణ కార్యక్రమాన్ని ఎంచుకునే అవకాశం కూడా ఉంది” అని ఈమెయిల్లో పేర్కొన్నారు.
మైసూర్‌లోని శిక్షణా కేంద్రం నుంచి బెంగళూరుకు రవాణా సౌకర్యంతో పాటు, వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా అందించనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. అవసరమైతే, వారు బయలుదేరే తేదీ వరకు మైసూర్‌లోని ఎంప్లాయీ కేర్ సెంటర్లో వసతి పొందవచ్చని, కౌన్సెలింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
కాగా, కొంతమంది ట్రైనీలు ఆన్‌బోర్డింగ్ కోసం రెండేళ్లకు పైగా వేచి చూసిన తర్వాత ఈ తొలగింపులు జరగడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న స్థూల ఆర్థిక మందగమనం కారణంగా ఐటీ కంపెనీలు ప్రాజెక్టులపై వ్యయాన్ని తగ్గించుకుంటున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్ఫోసిస్ లో తదుపరి బ్యాచ్ ట్రైనీల అసెస్మెంట్ ఫలితాలు వచ్చే వారం వెలువడే అవకాశం ఉందని సమాచారం.