నేడు ఏపీ క్యాబినెట్ భేటీ .. పలు కీలక అంశాలపై చర్చ

V. Sai Krishna Reddy
1 Min Read

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై క్యాబినెట్ చర్చించి ఆమోదం తెలపనుంది.

సీఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు క్యాబినెట్ అనుమతి ఇవ్వనుంది. నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఐదో ఎన్ఐపిబీ సమావేశంలో ఆమోదించిన పెట్టుబడులపై నిర్ణయం తీసుకోనుంది.

అలాగే కొత్తగా రూ.30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు వచ్చే ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ ఏర్పాటుతో పాటు పలు కంపెనీల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.

ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూకేటాయింపులకు క్యాబినెట్ ఆమోదించనుంది. కుప్పం నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. నెల్లూరులో ఏపీఐఐసీకి, విజయనగరం జిల్లాలో గ్రేహౌండ్స్‌కు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఉండవల్లి, పెనుమాక రైతులకు జరీబు భూములకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశంపై అథారిటీ తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదించనుంది. అమరావతి రాజధాని పునః ప్రారంభ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపైనా క్యాబినెట్‌లో చర్చించనున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *