ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, వరుసగా సంబంధాలు చూస్తున్నా ఏ ఒక్కటీ కుదరకపోవడంతో ఓ మహిళా కానిస్టేబుల్ మనస్థాపానికి గురైంది. ఆవేదనతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. అవమానభారంతో బలవన్మరణానికి పాల్పడింది. జనగామ జిల్లాలో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన నీలిమ 2020లో ఏఆర్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయింది. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకుని వరంగల్ కమిషనరేట్ లో విధుల్లో చేరింది. తల్లిదండ్రులు నీలిమకు వివాహం చేయాలని సంబంధాలు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండడంతో పెద్ద సంఖ్యలో సంబంధాలు వచ్చినా ఏదో కారణంతో అవేవీ కుదరలేదు.
దీంతో కొంతకాలం వివాహ ప్రయత్నాలు ఆపేసిన నీలిమ.. ఇటీవల మళ్లీ సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. అయితే, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరకపోవడంతో నీలిమ అవమానంగా భావించి కుంగిపోయింది. ఈ క్రమంలోనే ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో నీలిబండ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కానిస్టేబుల్ నీలిమ ఆత్మహత్య చేసుకుందనే సమాచారంతో తండాకు చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నీలిమ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.