ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 24 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ బుధ, గురువారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏప్రిల్ 11న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున, ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని సూచించారు.