తెలంగాణ రాష్ట్ర రైతులకు మోడీ సర్కార్ గుడ్‌న్యూస్ తెలిపింది. రబీ సీజన్‌లో రైతులకు ఎరువుల కొరత లేకుండా హామీ ఇస్తుందని కేంద్రం బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రకటించారు. అయితే తెలంగాణకు ఇచ్చిన ఎరువుల గురించి వివరాలు తెలిపారు. రానున్న రోజులలో తెలంగాణ రైతులకు ఎరువు కొరత ఉండదని స్పష్టం చేశారు. 2024-25 రబీ సీజన్‌లో దేశవ్యాప్తంగా రైతులకు ఎరువుల కొరత లేకుండా చూసుకుంటుంటుందని అన్నారు. 2024-25 రబీ సీజన్ కోసం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మార్చి 24, 2025 నాటికి సరఫరా చేయబడిన ఎరువుల వివరాలు మంత్రి వెల్లడించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎరువుల సబ్సిడీల కోసం రూ.12 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా రైతులకు ఎరువులు చాలా తక్కువ ధరలకు అందుబాటులో తీసుకువచ్చింది. గతంలో ఎరువులు పొందడానికి రైతులు పొడవైన క్యూలలో వేచి ఉండాల్సి వచ్చింది. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల కారణంగా రైతులు ఇకపై అలాంటి ఇబ్బందులను ఎదుర్కోలేదు. అలాగే వారు సబ్సిడీ ధరలకు అవసరమైన మొత్తంలో ఎరువులను పొందగలుగుతున్నారు. ఈ చర్యలలో వేప పూతతో కూడిన యూరియా సరఫరా, అనేక మూసివేసిన ఎరువుల ప్లాంట్ల పునరుద్ధరణ, కొత్త ప్లాంట్ల స్థాపన, ఆధునిక యంత్రాలతో ఉన్న ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, జాతీయ ఎరువుల పర్యవేక్షణ వ్యవస్థను సృష్టించడం, అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) వ్యవస్థ ద్వారా ఎరువుల బ్లాక్-మార్కెటింగ్‌ను నిరోధించడం ఉన్నాయి. అలాంటి ఒక చొరవ RFCL (రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) స్థాపన, దీనిని రూ.6,338 కోట్ల పెట్టుబడితో ప్రారంభించారు. 2024-25 రబీ సీజన్ కోసం, అన్ని రాష్ట్రాలకు ఎరువులు సరఫరా చేసింది కేంద్రం. అలాగే వాటి అవసరాలను తీర్చడానికి వివిధ రాష్ట్రాలలో ఇప్పటికీ నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
ప్రతి పంట సీజన్ ముందు కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి రాష్ట్రంలోని రైతులకు తగినంత ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని, ప్రతి రాష్ట్రంలో వారి నెలవారీ అవసరాలకు అనుగుణంగా అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన డేటా ఆధారంగా.. కేంద్ర ఎరువుల శాఖ రాష్ట్రాలకు నెలవారీగా తగినంత ఎరువులు సరఫరా చేసింది.