కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకువచ్చిన వాట్సాప్ ఈ-గవర్నెన్స్ విధానంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వాట్సాప్ ఈ-గవర్నెన్స్ ద్వారా 200 రకాల పౌరసేవలు అందించగలుగుతున్నామని, సర్టిఫికెట్ల జారీ ఎంతో సులభంగా మారిందని తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి 300 పౌరసేవలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు.
గతంలో చంద్రబాబు పౌరసేవలను ఈ-సేవగా మార్చి ప్రజలకు వద్దకు పాలన తీసుకువెళ్లారని తెలిపారు. తాను గతేడాది నిర్వహించిన యువగళం పాదయాత్ర ద్వారా, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్నానని వెల్లడించారు.
ప్రభుత్వం నుంచి సేవలు అందుకోవాలంటే గతంలో ప్రజలు చేతులు కట్టుకుని నిల్చోవాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. ఈ పద్ధతి కాకుండా, సులభతరంగా పౌరసేవలు అందించాలని నిర్ణయించామని… అందులో భాగంగా వాట్సాప్ ఈ-గవర్నెన్స్ తీసుకువచ్చామని మంత్రి నారా లోకేశ్ వివరించారు.