తనకు మంత్రి పదవి వస్తే పార్టీకి, తెలంగాణ ప్రజలకే లాభమని, కానీ ఆ పదవి ఎప్పుడు వస్తుందో చెప్పలేనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భువనగిరి ఎంపీ స్థానం కోసం నిద్రాహారాలు మానుకొని కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించానని ఆయన వెల్లడించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయడంపై కూడా రాజగోపాల్ రెడ్డి స్పందించారు. జగదీశ్ రెడ్డి స్పీకర్ చైర్‌ను ప్రశ్నించడం సరికాదని అన్నారు. స్పీకర్ కుర్చీని ఎవరూ ప్రశ్నించలేరని ఆయన అన్నారు.
అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి అతిగా ప్రవర్తించారని, స్పీకర్ కుర్చీని అవమానించినందుకే ఆయనపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. తాము ఎవరినీ లక్ష్యంగా చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. కానీ తప్పు చేస్తే వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు.