బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ అరెస్టయిన రన్యా రావు ఈ కేసు నుంచి బయటపడేందుకు రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులను సంప్రదించే ప్రయత్నం చేశారని కర్ణాటక బీజేపీ ఆరోపించింది. బంగారం అక్రమ రవాణా అంశం కర్ణాటకలో దుమారం రేపుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి.
రన్యా రావు ఇద్దరు మంత్రులను సంప్రదించే ప్రయత్నాలు చేశారంటూ కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్రతో సహా పలువురు నేతలు ఆరోపణలు చేశారు.
బీజేపీ హయాంలో రన్యా రావుకు కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా బోర్డు స్థలం కేటాయించిందని కాంగ్రెస్ ఆరోపించింది. రన్యా రావు కేసు సీబీఐ పరిధిలోకి వెళ్లిందని, ఆమె వెనుక ఎవరున్నారో తెలియాలని కర్ణాటక బీజేపీ నేత, ఎమ్మెల్యే భరత్ శెట్టి అన్నారు.
ఈ కేసులో కేంద్రమంత్రుల ప్రమేయం వార్తలు ఆశ్చర్యం కలిగించలేదని, ప్రోటోకాల్స్ దుర్వినియోగం చేయడం వల్లే రన్యా రావు రూ. 12 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలించగలిగారని విజయేంద్ర పేర్కొన్నారు. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల మద్దతు లేకుండా ఇది జరగదని వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నిఘా వర్గాల నుండి నివేదికలు అంది ఉంటాయని పేర్కొన్నారు. మంత్రులను కాపాడేందుకు ప్రయత్నిస్తే ఎదురుదెబ్బ తప్పదని హెచ్చరించారు. ప్రజలంతా గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలని సూచించారు.
బీజేపీ నేతల వ్యాఖ్యలపై రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర స్పందించారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, పూర్తి వివరాలు బయటకు రానివ్వాలని అన్నారు. అప్పటి వరకు అన్నీ ఊహాగానాలే అవుతాయని చెప్పారు. భూమి కేటాయించిన అంశం కూడా బయటకు రావాలని అన్నారు