పెళ్లి కొడుకు నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో గరువారం రాత్రి జరిగిందీ దుర్ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మెట్‌పల్లికి చెందిన బకారపు ప్రభాకర్ కుమార్తె నవ్య, మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన జనుక అశోక్ ల వివాహం గురువారం జరిగింది.
పెళ్లి వేడుకలో భాగంగా బరాత్ నిర్వహించారు. వధూవరులతోపాటు ఆరుగురు కారులో కూర్చున్నారు. ప్రభాకర్ ఇంటి నుంచి బరాత్ బయలుదేరింది. అదే సమయంలో డ్రైవర్‌కు ఫోన్ రావడంతో మాట్లాడేందుకు కారు ఆపి కిందికి దిగాడు. దీంతో పెళ్లి కొడుకు స్టీరింగ్ అందుకున్నాడు. కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చే క్రమంలో అదుపు తప్పి వేగంగా ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన నిల్చుని బరాత్‌ను తిలకిస్తున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బకారపు ఉమ (35), ఆమె కుమార్తె నిఖితతో పాటు పలువురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఉమను తొలుత హుజూరాబాద్ ఆసుపత్రికి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా నిన్న తెల్లవారుజామున ఆమె మృతి చెందింది.