గత నెల 22న నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో 8 మంది గల్లంతయ్యారు. వారి కోసం గత 11 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లో కొన్ని అడుగుల మేర బురద పేరుకుని ఉండడంతో సహాయక బృందాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి.
ఈ నేపథ్యంలో, నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. టన్నెల్ వద్ద కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వచ్చింది. సాంకేతిక సిబ్బంది కన్వేయర్ బెల్టును పునరుద్ధరించారు. కన్వేయర్ బెల్టు సాయంతో టన్నెల్ లోని బురదను బయటికి తరలిస్తున్నారు. దాంతో, సహాయక చర్యల్లో కొద్ది మేర పురోగతి కనిపించింది.
దీనిపై అధికారులు స్పందిస్తూ… ఘటన స్థలం నుంచి 6 వేల క్యూబిక్ మీటర్ల బురదను తొలగించాల్సి ఉందని తెలిపారు. టన్నెల్ లో 200 అడుగుల వరకు బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయని వివరించారు.