పార్టీ మార్పు వార్తలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడిన ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే పార్టీకి రాంరాం చెప్పబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. దీనికితోడు, రాహుల్ గాంధీ ఎవరో తనకు తెలియదన్న సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో శివరాత్రి ఉత్సవాల్లో వేదిక పంచుకోవడం సొంత పార్టీలోనే విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
దీంతో స్పందించిన డీకే.. ఈ వార్తలను కొట్టిపడేశారు. కాంగ్రెస్‌కు తాను నమ్మకమైన కార్యకర్తనని, పార్టీపైనా, గాంధీ కుటుంబంపైనా తనకున్న నిబద్ధతను ఎవరైనా ప్రశ్నిస్తే అది వారి భ్రమే అవుతుందన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాను ఎవరికీ ఎలాంటి షరతులు విధించలేదని, అలాంటి అవసరం కూడా తనకు లేదని డీకే నొక్కి చెప్పారు. కండిషన్లు పెట్టడం, బ్లాక్‌మెయిల్ చేయడం తన రక్తంలోనే లేదన్నారు. కాగా, గత ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి విషయంలో సిద్ధరామయ్య, డీకే మధ్య పోటీ నెలకొంది. చివరికి రెండున్నరేళ్ల చొప్పున సీఎం పీఠాన్ని పంచుకునేందుకు సిద్ధరామయ్య, డీకే అంగీకరించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పటికీ ఈ అంశంపై చర్చ జరుగుతున్నప్పటికీ అధిష్ఠానం నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేకపోవడంతో పార్టీ వీడాలని డీకే నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడీ ఊహాగానాలకు శివకుమార్ చెక్ పెట్టారు