ఈ రోజు నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోదరులకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేశ్ తదితరులు ‘ఎక్స్’ వేదికగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో చేసే ప్రార్థనలు ఫలించాలని, ఆ అల్లా దయతో అందరికీ మంచి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
రంజాన్ చాంద్ ముబారక్ అంటూ నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. నెలవంక కనిపించింది కావున పవిత్ర రంజాన్ మాసం ఆరంభమైందన్నారు. నెలంతా ఉపవాసాలు, పవిత్ర ఖురాన్ పఠనం, తరావీ నమాజ్ భక్తి శ్రద్ధలతో చేపట్టే ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అల్లా దయతో క్రమశిక్షణ, శాంతి సహనం, దాన గుణంతో కఠోర ఉపవాస దీక్షలు సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని లోకేశ్ అన్నారు.