దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య భూతంతో పోరాడుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ అక్కడ కాలుష్యం పెరుగుతోంది. దీంతో కాలుష్య నివారణకు ఢిల్లీ సర్కార్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయవద్దని ఆదేశించింది.
ఈ మేరకు రవాణశాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా ఈరోజు ఢిల్లీలోని అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి అందరూ తప్పకుండా నిబంధనలు అమలు చేయాలని బంకుల యజమానులను ఆదేశించారు. వాయు కాలుష్యంతో ఢిల్లీ సతమతమవుతోందని, ఇకపై కఠిన నిర్ణయాలు తప్పవని మంత్రి చెప్పారు. అప్పుడే పరిస్థితుల్లో ఎంతోకొంత మార్పు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వాహనాలను గుర్తించేందుకు పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే 2025 చివరి నాటికి పబ్లిక్ సీఎన్‌జీ బస్సుల్లో 90 శాతం బస్సులను తొలగిస్తామని ప్రకటించారు. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టున్నట్లు మంత్రి మంజీందర్ సింగ్ తెలిపారు.