ఎస్ఎల్బీసీ సొరంగంలో మృతదేహాలు లభించాయన్న వార్తలపై నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ స్పందించారు. టన్నెల్లో మృతదేహాలు లభించాయని జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. ఇలాంటి తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సొరంగంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఏదైనా సమాచారం ఉంటే తాము వెల్లడిస్తామని తెలిపారు. అసత్య ప్రచారాలు నమ్మవద్దని అన్నారు.
ఆ తర్వాతే మృతదేహాలా, కాదా తెలిసే అవకాశం
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యల్లో పురోగతి లభించింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం పలు విధాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగాన్ని స్కానింగ్ చేశారు. సొరంగంలో ఐదు చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు గుర్తించారు.
సొరంగంలో చిక్కుకున్న వారు అక్కడే ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ మెత్తని భాగాలు మానవ మృతదేహాలు కావొచ్చు లేదా కాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. మెత్తని భాగాలు ఉన్నచోట అధికారులు తవ్వకాలు జరపనున్నారు. తవ్వకాలు జరిగిన తర్వాతే అవి మృతదేహాలా, కాదా? అనే స్పష్టత రానుంది.