కర్ణాటక అసెంబ్లీలో ఇటీవల ఎమ్మెల్యేల గైర్హాజరు పెరుగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సభలో పాల్గొనే ఎమ్మెల్యేలు, భోజన విరామం అనంతరం తిరిగి రాకుండా పోతున్నారు
తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’ అదేదో సినిమాలో చెప్పిన డైలాగ్ లాగే ఉంది ఇప్పుడు కర్ణాటకలోని ఎమ్మెల్యేల పరిస్థితి. ప్రజా సమస్యలు ప్రస్తావించే కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మధ్యాహ్నం తిని పడుకోవడానికి ఏర్పాట్లు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం తిన్నాక ఎవరూ అసెంబ్లీకి రావడంలేదని గ్రహించిన స్పీకర్.. ఏకంగా అసెంబ్లీలోనే పాన్పులు ఏర్పాటు చేసిన వైనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి..
కర్ణాటక అసెంబ్లీలో ఇటీవల ఎమ్మెల్యేల గైర్హాజరు పెరుగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సభలో పాల్గొనే ఎమ్మెల్యేలు, భోజన విరామం అనంతరం తిరిగి రాకుండా పోతున్నారు. దీనివల్ల ముఖ్యమైన చర్చలు జరగడం లేదు, బిల్లుల ఆమోద ప్రక్రియ అంతరాయానికి గురవుతోంది. ఈ సమస్య పరిష్కారానికి అసెంబ్లీ స్పీకర్ ఖాదర్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీలో కొత్త మార్పులు సభ్యులు భోజనం అనంతరం విశ్రాంతి అవసరమని గుర్తించిన స్పీకర్, అసెంబ్లీలో రిక్లైనర్లు ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. దీంతో ఎమ్మెల్యేలు సభ ప్రాంగణంలోనే విశ్రాంతి తీసుకుని, తిరిగి చర్చలకు హాజరయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మార్చి 3 నుండి 21 వరకు జరిగే సమావేశాల్లో ప్రయోగాత్మకంగా 15 రిక్లైనర్లు అద్దెకు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.
రిక్లైనర్లు సాధారణ సోఫాల కంటే మెత్తగా ఉంటాయి. వీటిలో అధికంగా దూదిని ఉపయోగించడం వల్ల అవి మరింత సౌకర్యంగా ఉంటాయి. వీటిని పుష్ బ్యాక్ చేయడం ద్వారా వీరి శరీరానికి ఉపశమనాన్ని కలిగించే విధంగా రూపొందించబడ్డాయి. దీని వల్ల నడుం నొప్పి సమస్య తక్కువగా ఉండటంతో పాటు, సభ్యులకు విశ్రాంతి కూడా లభిస్తుంది.