ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానమే వస్తుందని సర్వేలన్నీ తేల్చేశాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని ఆయన అన్నారు.
ఎన్నికల్లో ఓడినా, గెలిచినా పోయేదేమీ లేదని ముఖ్యమంత్రి అంటున్నారని, అలాంటప్పుడు ఆయన ప్రచారానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు.
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై మీరు విచారణ జరుపుతూ, కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీకి చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వ కుంభకోణాలను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పుడు దోషులను లోపల వేస్తామని తేల్చి చెప్పారు.