ఎస్ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, లోపలి పరిస్థితులు కఠినంగా ఉండటంతో రెండో రోజు కూడా వారి ప్రయత్నాలు ఫలించలేదు. లోపల అంతా బురదగా ఉండటం, టీబీఎం యంత్రం పైభాగం కుంగిపోవడం, ఇతర పరికరాలు అడ్డంగా ఉండటంతో ముందుకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. టీబీఎం యంత్రం సమీపం వరకు చేరుకున్న ఆర్మీ, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు పేర్లు పెట్టి పిలిచినా చిక్కుకుపోయిన వారి నుంచి స్పందన రావడం లేదు.
శ్రీశైలం జలాశయం వైపు నుంచి 14వ కిలోమీటర్ వద్ద శనివారం ఉదయం కార్మికులు పనుల్లో ఉన్న సమయంలో పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఆ వెంటనే కొందరు బయటపడగా యంత్రానికి అటువైపున ఉన్న 8 మంది చిక్కుకుపోయారు. వారిని సన్నీసింగ్, గురుప్రీత్ సింగ్, సంతోష్ సాహు, అనూజ్ సాహు, జక్తాజస్, సందీప్ సాహు, మనోజ్ కుమార్, శ్రీనివాస్‌గా గుర్తించారు.
కాగా, విశాఖపట్నం నుంచి మూడు హెలికాప్టర్ల ద్వారా వచ్చిన నౌకాదళం సభ్యులు నేటి నుంచి రంగంలోకి దిగనున్నారు. భూగర్భ గనుల్లో రక్షణ చర్యలపై అవగాహన ఉన్న సింగరేణి విపత్తు నిర్వహణ బృందం కూడా పలు పరికరాలతో ఘటనా స్థలానికి చేరుకుంది. 130 మంది ఎన్‌డీఆర్ఎఫ్, 120 మంది ఎస్‌డీఆర్ఎఫ్, 24 మంది ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం నుంచి వచ్చిన 24 మంది, హైడ్రా నుంచి వచ్చిన 24 మంది సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు.