టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రయాణిస్తున్న కారు నిన్న ప్రమాదానికి గురైంది. బర్దమాన్ వెళుతుండగా దంతన్‌పూర్ సమీపంలో దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆయన కారు స్వల్పంగా దెబ్బతినగా, ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గంగూలీ రేంజ్‌రోవర్ కారులో బర్దమాన్ వెళుతుండగా అకస్మాత్తుగా ఓ లారీ ఆయన కాన్వాయ్‌లోకి చొరబడింది. దీంతో కాన్వాయ్‌లోని వాహనాలు అదుపు తప్పాయి. ప్రమాదాన్ని నివారించేందుకు గంగూలీ కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. దీంతో వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. వెనుకనున్న కారు గంగూలీ కారును ఢీకొట్టింది. వాహనాలు సాధారణ వేగంతో వెళుతుండటంతో పెను ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
అనంతరం గంగూలీ తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించి, బర్దమాన్ చేరుకున్నారు. అక్కడ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంతో పాటు, బర్దమాన్ స్పోర్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన మరో కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు