బర్డ్ ఫ్లూ భారతదేశాన్నే కాదు అమెరికాను కూడా భయపెడుతోంది. ఒకవైపు బర్డ్ ఫ్లూ కారణంగా మన దేశంలో చికెన్, గుడ్లు తినాలంటే ప్రజలు భయపడుతుండటంతో చికెన్, గుడ్ల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. అయితే అమెరికాలో బర్డ్ ఫ్లూ దెబ్బకు కోడి గుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. అమెరికాలో గుడ్లను ప్రోటీన్లు అందించే ఆహారంగా భావిస్తారు. దీంతో అక్కడ గుడ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది.
బర్డ్ ఫ్లూ కారణంగా గుడ్లు పెట్టే కోళ్లు చనిపోతుండటంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ కారణంగా గుడ్ల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఎఫెక్ట్ గుడ్ల ధరలపై పడింది. ప్రస్తుతం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో డజను గుడ్ల ధర ఏకంగా పది డాలర్లు (సుమారు రూ.867)కు చేరింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత ఏడాది జనవరి నుంచి అమెరికాలో గుడ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ డజను గుడ్ల ధర ఏకంగా 65 శాతం పెరిగింది. గుడ్ల ఉత్పత్తి పడిపోవడంతో కొన్ని సూపర్ మార్కెట్లలో వినియోగదారులకు విక్రయించే గుడ్లపై పరిమితులు విధించారు.