నేను ఆఖరి ‘రెడ్డి’ ముఖ్యమంత్రిని అయినా ఫర్వాలేదని, కానీ తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యతను తీసుకున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుల గణన సందర్భంగా కులాల లెక్కలను పక్కాగా తేల్చామని, మా నాయకుడి ఆదర్శాన్ని నిలబెట్టేందుకు నేను కార్యకర్తగా మిగిలేందుకు కూడా సిద్ధమేనని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన కుల గణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నా కోసమో, నా పదవి కోసమో కుల గణన చేయలేదన్నారు. కులాల లెక్కలను పక్కాగా తేల్చామని ఆయన అన్నారు. ఇదీ తన నిబద్ధత అన్నారు. కొందరు ఆరోపిస్తున్నట్లుగా కుల గణనలో ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు. కుల గణన సర్వేను తప్పుబడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా కుల గణన జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటులో నిలదీశారని ఆయన అన్నారు. కుల గణన సర్వే జరగకూడదని మోదీ, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీ పుట్టుకతో బీసీ కులస్థుడు కాదని, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక గుజరాత్‌లో తన కులాన్ని బీసీలోకి తీసుకువచ్చారని ఆయన అన్నారు. మోదీ పేరుకే బీసీ అని, వ్యక్తిత్వం మాత్రం అగ్ర కులమే అని విమర్శించారు.