మొయినాబాద్ మండలంలో జరిగిన కోడిపందేలకు తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసుల నోటీసులకు పూర్తి వివరణ ఇస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన తెలిపారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారికి లీగల్ నోటీసులు జారీ చేస్తానని హెచ్చరించారు. తొల్కట్టలో జరిగిన కోడిపందేల కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు.
2018లో కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన వ్యవహారాలన్నీ తన మేనల్లుడు జ్ఞాన్దేవ్ రెడ్డి చూసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అక్కడ ఫాంహౌస్ లేదా గెస్ట్ హౌస్ వంటి నిర్మాణాలు ఏమీ లేవని, కేవలం మామిడి, కొబ్బరి తోటల పనుల కోసం పనిచేసే వారి కోసం రెండు గదులు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు.
తన ప్రమేయం లేకుండానే ఆ తోటను వర్రా రమేశ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చినట్లు, ఈ విషయం ఘటన జరిగిన తర్వాత తనకు తెలిసిందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని జ్ఞాన్దేవ్ రెడ్డి చెప్పినట్లు తెలిపారు. వర్రా రమేశ్ కుమార్ రెడ్డి కూడా ఆ తోటను వెంకటపతిరాజుకు కౌలుకు ఇచ్చారని, ఈ విషయం నిన్నటి వరకు తన దృష్టికి రాలేదని ఆయన అన్నారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
మీడియాలో వస్తున్న కథనాల్లో పేర్కొన్నట్లుగా ఆ తోటలో అసాంఘిక కార్యకలాపాలు జరిగి ఉంటే తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఘటన జరిగిన రోజు తాను హైదరాబాద్లోనే లేనని, తాను వరంగల్లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో పాల్గొన్నానని ఆయన వివరించారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు