వందే భారత్ రైళ్లలో ప్రయాణించే వారి కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి అందులో ప్రయాణించే ఏ ప్రయాణికుడైనా టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా, ప్రయాణం చేసే సమయంలో వాటిని కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది. అహారం అందుబాటులో ఉన్నదాన్ని బట్టి సిబ్బంది అహారం అందిస్తారని రైల్వే బోర్డు వెల్లడించింది. ఈ మేరకు ఐఆర్సీటీసీకి రైల్వే బోర్డు లేఖ రాసింది.
వందే భారత్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీల్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. కొందరు వేరే ఆహారాన్ని చూసుకోవచ్చనే ఉద్దేశంతో ఫుడ్ ఆప్షన్‌ను స్కిప్ చేస్తుంటారు. అయితే, ఒక్కోసారి ఇలా చేసుకోవడం వల్ల రైళ్లలో డబ్బులు ఇచ్చి కొందామన్నా కూడా ఆహారం ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. డబ్బులు చెల్లిస్తామన్నా కూడా సిబ్బంది ఫుడ్ ఇవ్వడం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
దీనిపై ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో తాజాగా రైల్వే బోర్డు ఈ సదుపాయాన్ని కల్పించింది. అంతే కాకుండా రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహారం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా ఐఆర్సీటీసీకి సూచనలు చేసింది. ప్రయాణికులకు అసౌకర్యం ఉండకుండా రాత్రి 9 గంటల తర్వాత ట్రాలీల రూపంలో విక్రయాలు చేయకూడదని చెప్పింది.