దేశం దృష్టిని ఆకర్షించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో తొలి ఫలితం రానుండగా, మధ్యాహ్నం నాటికి ఫలితాలపై ఓ స్పష్టత రానుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. 31 స్థానాల్లో కాషాయ పార్టీ ముందంజలో ఉండగా, 25 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. కాగా, ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులను మోహరించారు.
ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు ఈ నెల 5న ఎన్నికలు జరిగాయి. 60.54 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్క్ 36. ఈ ఎన్నికల్లో బీజేపీదే గెలుపని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా, కేజ్రీవాల్ మాత్రం వీటిని కొట్టిపడేశారు. గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలిస్తే నాలుగోసారి పాలనా పగ్గాలు చేపడుతుంది.
మరోవైపు, సుదీర్ఘకాలంగా అంటే దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు ఢిల్లీ పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ గెలుపుపై ధీమాగా ఉంది. ఇక, 2013 నుంచి వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ ఆ తర్వాతి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ బోల్తాపడుతోంది. ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటలేకపోతోంది.